Chandrababu: ఆర్థిక అభివృద్ధి దిశగా రాష్ట్రం అడుగులు..! 1 y ago
AP : ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంతాన ఉత్పత్తిని పెంచాలని, ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు ఇస్తామన్నారు. పేదరికాన్ని తగ్గిస్తూ సమాజ నిర్మాణం చేయడమే లక్ష్యమని, ఈ నెలలోనే పీ4 విధానం ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా మహిళలను దృష్టిలో పెట్టుకునే చేసిందని, మహిళా సాధికారితపై మాటల్లో చెప్పడం కాదు.. చేతల్లో చేసి చూపించాలన్నారు. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారని, ఇచ్చిన ఆస్థిని కూడా వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు.
విద్యా, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని, రిజర్వేషన్లు ఇవ్వడం వలన మహిళలు బాగా చదువుకున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని, ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహిళలకే ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. డీలిమిటేషన్ పూర్తయితే సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని, పురుషులకంటే మహిళలే తెలివైనవారని చెప్పారు. మహిళలు చదువుకోకున్నా లోక పరిజ్ఞానంలో ముందుంటారన్నారు.
డ్వాక్రా మహిళలు రూపాయి పొదుపు చేస్తే తాను రూపాయి ఇచ్చానని, ఈ సంఘాల మద్దతుతో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేస్తామని, టీడీపీతోనే మహిళా సాధికారిత సాధ్యం అని తెలిపారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని, భూమి ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడరని, కానీ ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇవ్వడం హర్షనీయమన్నారు.